సెలెక్ట్‌ కమిటీకి వికేంద్రీకరణ బిల్లు

అమరావతి : అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ ఉపసంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదిస్తున్నట్లు మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ప్రకటించారు. నిబంధనల ప్రకారం పంపకూడదని, తన విచక్షణాధికారాల మేరకే బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపుతున్నామని ఛైర్మన్‌ ప్రకటించారు. బుధవారం ఉదయం నుంచి బిల్లులపై మండలిలో చర్చ జరిగింది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయంలో బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి నివేదిస్తున్నట్లు టీడీపీ నోటీసు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో సెలెక్ట్‌ కమిటీకి పంపవద్దని ఛైర్మన్‌కు మంత్రులు సూచించారు. సుదీర్ఘంగా దీనిపై చర్చ జరిగింది.











మండలిలో తమకు ఉన్న సంఖ్యా బలాన్ని అడ్డుపెట్టుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి మోకాలొడ్డింది. మొదటి నుంచి వికేంద్రీకరణ బిల్లును వ్యతిరేకిస్తున్న టీడీపీ.. మరోసారి అదే ధోరణిని ప్రదర్శించి బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపింది. కాగా, బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపడాన్ని వైఎస్సార్‌సీపీ సభ్యులు తప్పుపట్టారు. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఛైర్మన్‌ వ్యవహరించారని ఆరోపించారు.